కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి
  • 50 మందికి పైగా అస్వస్థత
  • తాగునీటి బావిలో చనిపోయిన కుక్క
  • సంగారెడ్డి జిల్లా సంజీవరావు పేటలో ఘటన

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు. 50 మంది అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం సంజీవరావు పేట గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఊర్లో ఉన్న బావి నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. శుక్రవారం బావి నుంచి బీసీ కాలనీకి పంచాయతీ సిబ్బంది నీటిని సప్లై చేశారు.

అయితే, అంతకుముందే ఆ బావిలో ప్రమాదవశాత్తు కుక్క పడి చనిపోయింది. దానిని పంచాయతీ సిబ్బంది గమనించలేదు. ఆ నీటిని తాగడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో దాదాపుగా 50 మందికి పైగా నారాయణఖేడ్ ఆస్పత్రిలో చేరారు. వీరిలో గొల్ల మహేశ్, సాయవ్వ ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కున్నారు. గ్రామంలో వెంటనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కాగా, గ్రామస్తులు అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతానికి ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.